పేద ముస్లిం, క్రిష్టియన్ యువతుల వివాహ సమయంలో ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన దుల్హన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున పథకాన్ని అమలు చేయలేమని రాష్ట్ర హై కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ దుల్హన్ పథకం ద్వారా వివాహ సమయంలో ప్రతీ ఆడబిడ్డకు లక్ష రూపాయాల ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పేద ముస్లింలకు ఆర్థిక చేయూత అందించేందుకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ఎటువంటి న్యాయం జరగలేదని, చంద్రబాబు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు కాలేదని ఎద్దేవా చేశారు.
కాగా, నేడు ఆర్థిక వెసులుబాటు లేదనే సాకుతో మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చెప్పుకొచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనారిటీ యువతుల వివాహాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించిన హామీని విస్మరించడం పై ఆయా వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చిన పేదల బతుకులు ఇంతేనని ముస్లింలు నిట్టూర్పుతున్నారు.
మైనారిటీల్లో బలహీన వర్గం అయిన ముస్లిం మహిళలు, పిల్లల విద్యా, ఆరోగ్య, ఆర్థిక చేయూత కోసం గత టీడీపీ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది. దుల్హన్ పథకం ద్వారా వివాహాలు జరిగే యువతుల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. మసీదు, దర్గాల్లో వుండే ఇమామ్, మౌజన్లకు నెలవారీ జీతాలు అందించారు. రంజాన్ పర్వవదినాన్ని పురస్కరించుకొని రంజాన్ తోఫా పథకం కింద వివిధ రకాల నిత్యావసరాలు అందించారు. హజ్ యాత్ర చేసే ముస్లింల కోసం హజ్ భవన్లు, విమాన సౌకర్యాలు కల్పించారు. అనేక స్వయం ఉపాధి పథకాల కల్పన కోసం ఉచిత శిక్షణలు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గత ప్రభుత్వం ఎం చేయలేదని అని చెప్పిన జగన్ ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.