అతి తక్కువ ద్రవ్యలోటుతో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను తరచూ శ్రీలంకతో పోలుస్తూ విపక్షాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ నాధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల కాగ్ నివేదికలను కూడా తప్పుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆర్బీఐ ఎక్కడ ఆంక్షలు విధించిందో యనమల చూపగలరా? అని సవాల్ చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలన కన్నా వైఎస్సార్ సీపీ మూడేళ్ల పాలనలో అప్పులు, వడ్డీలు, ద్రవ్యలోటు తక్కువేనని కాగ్ గణాంకాలతో స్పష్టమైందని తెలిపారు. బడ్జెట్ అంచనాలు, వ్యయం కూడా టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఎక్కువని చెప్పారు. బుగ్గన శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అప్పులపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.