పేదలపై కోపమో, అన్నగారి పేరు అంటే ద్వేషమో, ఆకలిజీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్న క్యాంటీన్లని మూసేశారు అని నారా లోకేష్ మీడియా ముఖంగా తెలియజేసారు. అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ సీఎం జగన్ కి లేఖ వ్రాసినట్లు లోకేష్ తెలియజేసారు. రాష్ట్రంలో 4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లకి రంగులు మార్చి మరీ తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే క్యాంటీన్లు మూతపడ్డాయి. నిధులు లేవు, అప్పులు దొరకడంలేదని మాత్రం సాకులు వెతకకండి. ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల బడ్జెట్ మీరు మీ మానసపుత్రిక సాక్షికి ఇచ్చే ప్రకటనలు బడ్జెట్ కంటే తక్కువే. కొన్నాళ్లు మీ సొంత మీడియాకి అనవసరపు ప్రకటనలు ఇవ్వడం ఆపేస్తే రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో అన్న క్యాంటీన్లను తెరిచి విజయవంతంగా నిర్వహించవచ్చు అని ఆయన వాపోయారు.