మహారాష్ట్రలో శివసేన నేతలు కార్యకర్తలు భగ్గుమంటున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను తప్పుపడుతూ శివసేన కార్యకర్తలు ఆదివారం మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలకు దిగారు. భారీగా బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు. నమ్మకద్రోహం చేసిన ఎమ్మెల్యేలను క్షమించేది లేదంటూ నినాదాలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే దిష్టిబొమ్మలను దహనం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అస్సాంలోని గౌహతిలోనే ఉండాలని రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.