వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న వైయస్ఆర్‌సీపీ మూడో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైయస్ఆర్‌సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2011 జూలై 8న ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ, 2017 జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన రెండో ప్లీనరీకంటే మూడో ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి పశ్చిమాన, తూర్పునకు అభిముఖంగా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మిస్తున్నారు. వేదికపై కూర్చున్నవారు, ప్రసంగించే వారు జాతీయ రహదారిపై నిలబడిన వారికి కూడా కనబడేలా నిర్మాణం జరుగుతోంది. వేదికకు ఎదురుగా ఎక్కువ మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు.