కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు, జిల్లాస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లు, నియోజకవర్గస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో చేశారని తెలిపారు. అయినా దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుంచే ప్రజల్లో సీఎం జగన్ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం రెట్టింపయ్యాయని తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోపక్క జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకు అందరూ నూతనోత్సాహంతో సమాయత్తమవుతున్న వాతావరణం సర్వత్రా నెలకొని ఉందన్నారు.