ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి సొమ్ములను తీసేసుకోవడాన్ని సాంకేతిక లోపం అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయితీల ఖాతాల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారు అని జనసేన పార్టీ పి.ఏ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు ప్రశ్నించారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జమ చేసిన 15వ ప్రణాళిక సంఘం నిధులను మళ్లించుకోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. నెలవారీ ఆదాయంలో కొంత సొమ్మును భవిష్యత్తు అవసరాలు, పిల్లల చదువులు, గృహ నిర్మాణం, వైద్య ఖర్చులు, తదితర అవసరాల నిమిత్తం జీ.పీ.ఎఫ్. నిధిగా పొదుపు చేసుకుంటున్న ఉద్యోగుల కష్టార్జితం రూ.800 కోట్లు మళ్లించేసిన వైసీపీని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయాలకు అతీతంగా పౌర సమాజం బాధిత ఉద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నదని, సగటు ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి ఉండే కుటుంబ సభ్యుల అవసరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నాకు తెలుసు అన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో నాగబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల మళ్లింపు, టీటీడీ వ్యవహారాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ........ “ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ.8 లక్షల కోట్ల రుణ భారాన్ని ఈ ప్రభుత్వం మోపింది సర్పంచుల ఖాతాల్లో చిల్లి గవ్వ లేకుండా తీసేసుకొంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితం కుడా దోచుకునేందుకు తెగించడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి పరాకాష్ట ఒక్క రూపాయి ఉత్పాదన గురించి ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను అమ్ముకోవడం, అడ్డూ అదుపూ లేకుండా పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ ఖజానాలో ప్రతీ పైసాను దారి మళ్లించడం 'జగన్ రెడ్డి గారి మార్కు పాలనగా ప్రజలకు అర్థం అవుతోంది. రాష్ట్ర ప్రజలు ఆదమరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం చేసే పరిస్థితి కనబడుతోంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం వచ్చింది" అన్నారు.