రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే పరిశ్రమలు క్యూకట్టి ఉండేవని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత యువతకు ఉన్న ఉపాధి వనరులు కూడా దూరమయ్యాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో పారదర్శకత లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. ఇటీవలి కేబినెట్ సమావేశంలో కియా పేరిట ఏపీఐఐసీ నుంచి కేటాయించిన 63 ఎకరాల స్థలం ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కియా సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కోసం ఇచ్చినట్లు రాసి ఆ తీర్మానాన్ని ఆమోదించిన అంశాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారన్నారు. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్... కియా మోటర్స్ రెండూ ఒక్కటేనా అని నిలదీశారు. ఆటోమోటివ్ అయిన కియాకీ సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. ఆ యూనిట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని తెలిపారు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం విజయవాడలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి భరోసా నింపేందుకు ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , జనవాణి - జనసేన భరోసా కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భారత దేశంలో ఉన్నత స్థాయికి చేరామని చేసిన ప్రకటనలు పేపర్లలో చూశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ అవార్డు ఎలా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికైనా కొత్తగా ఉపాధి కల్పించారా? అని ప్రశ్నించారు.