అమరావతికి మళ్లీ పూర్వవైభవం వస్తుందా అంటే ఆ మేర అక్కడి ప్రజల్లో కొంత విశ్వాసం వ్యక్తమవుతోంది. కారణం అమరావతిలో ఏపీ హైకోర్టు ఆదేశాలతో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. రాజధాని గ్రామం దొండపాడు పరిధిలోని పిచుకలపాలెంలో అమరావతిలో జోన్-4 లే అవుట్‌కు శంకుస్థాపన చేశామని చేపట్టడం జరిగిందని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. దశల వారిగా అమరావతిలో పనులు చేపడతామన్నారు. జోన్-4లో రూ. 192.52 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని.. అలాగే 63 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయన్నారు.
ఈ జోన్-4లో 1358.42 ఎకరాల్లో 4551 ప్లాట్లు మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని.. సీడ్ యాక్సెస్ రహదారిలో 4 చోట్ల కనెక్టీవిటీ లేదని.. అది కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. మిగిలిన జోన్లలో కూడా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన.. అమరావతిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే రూ. 2,500 భృతి మూడు నెలలు పెండింగ్ ఉందని గుర్తు చేశారు. 15 రోజుల్లో ఒక నెల రూ. 2,500 భృతి జమ చేస్తామని.. మిగిలిన రెండు నెలలు త్వరలో ఇస్తామన్నారు. అసైన్డ్ భూముల సమస్య తొలిగిపోయాక... కౌలు జమ చేస్తామన్నారు. సమస్యలు లేనివారికి కౌలు అందజేశామని తెలిపారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల భవనాల తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివేక్ తెలిపారు. మొత్తం 12 జోన్లలోని ఎల్పీఎస్ లే అవుట్లలోని రైతుల ప్లాట్లను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పనులు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్లాట్ల అభివృద్ధిలో ప్రధాన సదుపాయాలైన రహదారులు, వంతెనలు, తాగునీటి సరఫరా, వరదనీటి కాలువల నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థతో పాటు మురుగుశుద్ధికి సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనుల టెండర్లను బెంగళూరుకు చెందిన బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా సంస్థ దక్కించుకుంది.