ప్రొద్దుటూరులో నియంతగా పాలన చేయాలనుకున్న వ్యక్తులు జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులను బెదిరిస్తున్నారని కడప జిల్లా వైఎస్సార్‌సీపీ నేత భాస్కర్ సొంత పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజుపాలెం జెడ్పీటీసీ మాజీ సభ్యుడినని.. తన భార్య రాజుపాలెం మండలం పగిడాల ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు పంపించారని చెప్పి యాకోబ్, మరికొందరు తనను అడ్డగించారని.. ఎంపీటీసీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయిస్తారా, రూ.11 లక్షలు డబ్బులు కడతావా అంటూ తనను బెదిరించారన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత నందం సుబ్బయ్యలాగే అందరినీ చంపేస్తారా అన్నారు. తాను వెల్లాల నుంచి బైక్‌పై ప్రొద్దుటూరుకు వస్తుంటే.. కొర్రపాడు రోడ్డులోని టీవీఆర్ పెట్రోల్ బంకు దగ్గర తనను కొందరు బెదిరించారన్నారు. వారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వర్గీయులు రామాపురంకు చెందిన యాకోబ్, మరికొందరిగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
డబ్బులు ఎందుకు కట్టాలని తాను ప్రశ్నించానని.. ఎంపీటీసీ సభ్యురాలిగా ఎలా గెలిచారని వారు అన్నారని.. గెలిస్తే కూడా డబ్బులు ఇవ్వాలా అని ప్రశ్నించాను అన్నారు. తనకు ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వలేదని.. తమ ప్రచారం..సేవ చేసి గెలిచామన్నారు. రౌడీలతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని.. ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే రాచమల్లు సమాధానం చెప్పాలన్నారు. తమను కొట్టడానికి.. దౌర్జన్యాలు చేయడానికి ఎమ్మెల్యేని చేశామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మండలాధ్యక్షుడి పదవి ఇవ్వకపోయినా భరించానని.. ఇప్పుడు దాడి చేసేందుకు మనుషుల్ని పంపడం దారుణమన్నారు.