ఏపీ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది. ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు వెళ్లే సమయంలో కృష్ణాజిల్లా గన్నవరంలో బ్లాక్ బెలూన్లు ఎగరేసిన కేసులో ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సుంకర పద్మశ్రీ , రవికాంత్, కిషోర్, సావిత్రి, రాజశేఖర్‌లు ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అర్ధ రాత్రి 2 గంటల వరకు హైడ్రామా కొనసాగగా ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.
తమ హక్కులు కోసం పోరాడటం ప్రజసామ్య హక్కు దాన్ని ఎవరూ ఆపలేరన్నారు కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అల్లూరి సీతారామరాజు విగ్రహం తాకితే కొంచమైనా దైర్యం వచ్చి ప్రధానిని ప్రత్యేక హోదాపై అడుగతారని తాము భావించామన్నారు. దైర్యం కాదు కదా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రి రోజా కలిసి మోదీతో సెల్ఫీలు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చి విభజన బిల్లులు, ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడకుండా కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.
హోదా గురించి అడిగితే తమపై కేసులు పెట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్రం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడిగేవారే లేరని.. ఇప్పటికీ మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లి ఆంధ్ర రాష్ట్రం ప్రయోజనాలను తాక్కటు పెట్టడం మానేయాలన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హోదా హామీ ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీని మించిన రాజధాని అన్నారు.. ఆ సంగతి ఏమైందన్నారు. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భీమవరం బయల్దేరి వెళుతున్న సమయంలో.. హెలికాప్టర్‌కు దగ్గర నల్ల బెలూన్లు కనిపించాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. వారి వివరాలపై ఆరా తీసి అరెస్ట్ చేశారు.