రేపటి తరం భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం మనదని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఇవాళ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా రూ.931 కోట్లతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 47 లక్షల మందికి మంచి చేయబోతున్నాను. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతోంది. చిక్కటి చిరునవ్వులతో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా ప్రతి అడుగులోనూ పేదరికం నుంచి బయట పడాలి. పోటీ ప్రపంచంలో నిలబడే పరిస్థితి రావాలి. అప్పుడే పేదరికం పోతుందనే గొప్ప ఆశయంతో మూడేళ్లుగా అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగా తమ పిల్లను బడికి పంపిన తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశాం. ఒక ఉద్యమంలా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చుతూ మన బడి నాడు–నేడు ద్వారా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్పులు తెస్తున్నాం. నాణ్యమైన పౌష్టికాహారం గురించి గత ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలేదు. వాటి పరిస్థితిని మారుస్తూ జగనన్న గోరు ముద్దు కార్యక్రమం తెచ్చాం. బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం. బైలివింగ్ టెస్ట్ బుక్స్ తెచ్చాం. మెరుగైన చదువులు అందుబాటులోకి తెచ్చేలా, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే పరిమితమైన బైజూస్ యాప్‌ను మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చాం అని తెలియజేసారు.