రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని, టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య పెద్ద కుట్ర జరిగిందని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. డేటా చోరీ, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ హౌస్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. భేటీ అనంతరం చైర్మన్ భూమాన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారన్నారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా.. దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. దీని వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర కూడా ఉందన్నారు. సేవ మిత్ర యాప్ ద్వారా డేటా చోరీ జరిగిందని హౌస్ కమిటీ చైర్మన్ భూమన తెలిపారు. దాదాపు 40 లక్షల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో హౌస్ కమిటీ సభ్యులు అబ్బయ్యచౌదరి, మద్దాల గిరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.