సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటూ, కేంద్ర ప్రభుత్వం ర్యాంక్‌లు ప్రకటిస్తే దానిపై విపక్ష తెలుగుదేశం కడుపు మంట చూపిస్తుంది అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దానికి మందు లేదు. టీడీపీ పార్టీ మనసులో రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు. ఎక్కడా అభివృద్ధి జరగకూడదు అని ఉంది. అవి జరిగితే ఈ ప్రభుత్వానికి పేరొస్తుందన్న అక్కసు. అందుకే అంత వ్యతిరేకత. పారిశ్రామిక అభివృద్ధి అంటే కేవలం పేపర్ల మీద జరిగేది కాదు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు నాలుగు పార్టనర్‌షిప్ సమ్మిట్లు పెట్టి, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా 40 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. అన్నీ కాగితాల మీదనే ఉండిపోయాయి. ఆ విధంగా నమ్మించి మోసం చేశారు. పారిశ్రామిక అభివృద్ధిని పేపర్లలో చూపించి, రాజధాని అభివృద్ధిని గ్రాఫిక్స్‌లో చూపించి, రాష్ట్రాభివృద్ధిని మాయమాటల్లో చెప్పారు. కానీ ఏ ఒక్క దాంట్లోనూ వాస్తవ అభివృద్ధి లేదు. అలా మోసం చేశారు కాబట్టే, ప్రజలు మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు అని రెచ్చిపోయారు.