అనంతపురం, ఉరవకొండ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్రకు భారీగా వరద వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా తుంగభద్ర బేసిన్‌లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూర్, వరనాడులో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రలో వరద ఉప్పొంగుతున్నది. కేవలం రోజు వ్యవధిలోనే డ్యామ్‌లోకి 10 వేల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 101. 855 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 58 టీఎంసీలు నిల్వ ఉండగా. 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1618 అడుగులకు చేరినట్టు వెల్లడించారు. ఒకే రోజులో 5 టీఎంసీల మేర నీరు డ్యాం లోకి వచ్చి చేరింది.