మన పూర్వీకులు, తాత ముత్తాతలు మట్టి పాత్రల్లోనే వంటలు వండుకునేవారు. ఎండిన పుల్లలు తెచ్చి మట్టి లేదా ఇటుకలతో చేసిన పొయ్యిలో వాటిని ఉంచి మంట వెలిగించేవారు. వాటిపై మట్టి పాత్రలు లేదా కుండలు పెట్టి వాటిలో అన్నం, కూరలు వండుకునేవారు. అప్పట్లో వంట గ్యాస్ అరుదుగా లభించేది. అందువల్ల ఇలా చేసేవారు. మట్టి కుండను మట్టితో తయారుచేస్తారు కదా. అందులో ఖనిజాలు వంటలో చేరి ఆ వంట తిన్నవారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండేది.
మట్టి కుండలో ఎక్కువ నూనెతో వండాల్సిన అవసరం ఉండదు. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. అంతేకాదు వంటలోని పోషకాలన్నీ వంటలోనే ఉంటాయి. బయటకు పోవు. మట్టి పాత్రల్లో వండటం అనేది అంత ఈజీ కాదు. వాటిని కడుక్కునేటప్పుడు కూడా చాలా శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే కడిగేందుకు వాడే కెమికల్స్ వాటిలో ఉండిపోతాయి. అలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా మట్టిలో మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్ లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ తినే ఆహారంలో చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన శరీరానికి ఇవి చాలా అవసరం. అందువల్ల మట్టిపాత్రల్లో వండితే ఇవి మనకు బాగా లభిస్తాయి. నాన్ స్టిక్, స్టీల్ పాత్రల కంటే మట్టి పాత్రలు తక్కువ రేటుకే లభిస్తాయి. కాకపోతే అవి పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సెరామిక్ కోటింగ్ వేసిన పాత్రలను కూడా వంటకు వాడకూడదు.