దక్షిణాదిలో బీజేపీ అగ్రనాయకత్వం దిద్దుబాటు చర్యలు చేప్టటింది. ముందునుంచీ ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ 2014లో భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దక్షిణాదిపై ఫోకస్ పెట్టలేదు. కేవలం ఇక్కడ ఓట్లు, సీట్ల రాజకీయంగానే దక్షిణాది రాష్ట్రాల్ని చూసిన బీజేపీని ఇక్కడి ప్రజల ఆదరణ కూడా అలాగే ఉంటోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు కానీ, ఇతర సాయం కానీ చేయడం కూడా మానేసింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ప్రత్యేక దేశం డిమాండ్ల వరకూ పరిస్దితులు వెళ్లాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇరుకునపడింది.
ఇప్పటివరకూ ఉత్తరాదిలో రాష్ట్రాల్లో మెజారిటీ ఉంటే చాలు దక్షిణాదితో పెద్దగా పనేముందని భావిస్తూ వస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తాజాగా చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం అధికారం, ఓట్లు, సీట్ల లెక్కల్లో పడి దక్షిణాదిని నిర్లక్ష్యం చేసిన పాపానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగుతోంది.ఇందులో భాగంగానే దక్షిణాదిపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్ని నిధుల విషయంలోనే కాదు మరే ఇతర విషయాల్లోనూ కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న భావన పెరిగిపోతోంది. దీనికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆజ్యం పోశాయి. ఇందులో రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఎంపిక చేయకపోవడం, అలాగే శ్రీలంకకు సాయం విషయంలో తమిళనాడులో డీఎంకే సర్కార్ ను కేంద్రం పట్టించుకోకపోవడం, ఏఫీ, తెలంగాణకు విభజన హామీల విషయంలో నిర్లక్ష్యం చూపడం వంటి కారణాలు ఆజ్యం పోశాయి. దీంతో కేంద్రంపై విమర్శలు మరింత పెరిగాయి.
దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న విమర్శలతో ఆత్మరక్షణలో పడిన కేంద్రం.. తాజాగా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోడీ భీమవరానికి వచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మోడీ భీమవరం వరకూ వచ్చారు. అదే సమయంలో దక్షిణాదితో పాటు అల్లూరి వంటి విప్లవవీరుల్ని గౌరవించామన్నసంకేతాలు పంపాలన్నది మోడీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
అలాగే తాజాగా కేంద్రం రాజ్యసభకు నలుగురు సభ్యుల్ని ఎంపీలుగా నామినేట్ చేసింది. ఇందులో ఏపీకి చెందిన విజయేంద్రప్రసాద్, కేరళకు చెందిన పీటీ ఉష, తమిళనాడుకు చెందిన ఇళయరాజా, కర్నాటకకుచెందిన వీరేంద్ర హెగ్డేకు అవకాశం కల్పించారు. తద్వారా నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు పెద్దల సభలో మరోసారి ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. అలాగే తమిళనాడుకు చెందిన తమిళిసై ని, తెలంగాణకు చెందిన దత్తాత్రేయల్ని ఇప్పటికే గవర్నర్లుగా కొనసాగిస్తున్నారు. ఇలా దక్షిణాది ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa