కష్టానికి తగ్గ ఫలితం ఎపుడూ పోదు. మనం శ్రమించుతూ పోతే ఫలితం దానంతట అదే వస్తుందంటారు పెద్దలు. ఇక్కడ ఓ వ్యక్తి ఏళ్లతరబడి చేసిన శ్రమకు ఫలితం దక్కింది. ఆ శ్రమ ఆ వ్యక్తి ఏకంగా గిన్నిస్ బుక్ లో ఎక్కేలా చేసింది. స్టాంపులు సేకరించడం కొందరికి హాబీ.. వివిధ దేశాలకు చెందిన నాణాలు, కరెన్సీ నోట్లు సేకరించడం మరికొందరికి అలవాటు.. ఖరీదైన పెయింటింగ్ లు, కార్ల వంటి వాటినీ సేకరించేవారు ఉంటారు. కానీ ఇటలీలోని మిలన్ కు చెందిన క్రిస్టియన్ కావలెట్టికి మాత్రం చాలా చిత్రమైన హాబీ ఉంది. అదేమిటో తెలుసా.. తాగి వదిలేసిన పెప్సీ క్యాన్లను సేకరించడం. చీ అదేం హాబీ అంటారా.. అంత మామూలుగా ఏమీ కాదు. ఆయన చాలా ఏళ్లుగా చాలా పెద్ద కలెక్షన్ ను సిద్ధం చేయసుకోవడం గమనార్హం. ఆయన సేకరించిన క్యాన్లు ఎన్నో తెలుసా.. ఏకంగా 12,042. దీని వెనుక ఎంతో కృషి, శ్రమ ఉన్నాయి. ఈ సేకరణ గిన్నిస్ బుక్ రికార్డుకు కూడా ఎక్కింది.
కావలెట్టి తన సోదరుడు ఎడోర్డోతో కలిసి 1989లోనే పెప్సీ క్యాన్లను సేకరించడం మొదలుపెట్టాడు. నిజానికి 4,391 క్యాన్లతో 2004 మార్చిలోనే కావలెట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా 12,042 క్యాన్ల కలెక్షన్‌తో మరో రికార్డు నెలకొల్పాడు. ఇందులో అన్ని ఖండాల్లోని 81 దేశాలకు చెందిన వెరైటీ పెప్సీ క్యాన్ లు ఉన్నాయి. ఇన్ని కాన్లను సేకరించడం కాదు.. వాటన్నింటినీ పద్ధతిగా ఒకదాని పక్కన ఒకటి పేర్చి పెట్టడం, ఏది ఎప్పటిదో, దేని ప్రత్యేకత ఏమిటో, ఏ దేశం నుంచి తెచ్చిందో తెలిసేలా నోట్ చేసి పెట్టడం గమనార్హం. ఇందుకైతే ఆయన ఓపికను మెచ్చుకోక తప్పదు.
ఎప్పుడో 1948లో మొదటిసారిగా పెప్సీ అమెరికా మార్కెట్లోకి వచ్చినప్పటి క్యాన్ నుంచి ఇప్పుడు వివిధ దేశాల్లో విక్రయిస్తున్న వెరైటీల దాకా అన్ని క్యాన్ లు కావలెట్టి దగ్గర ఉన్నాయి. అంతరిక్షంలో తాగి పడేసిన పెప్సీ క్యాన్ కూడా ఆయన దగ్గర ఉంది తెలుసా.. 1980లో అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికన్ ఆస్ట్రోనాట్ స్పేస్ ఫ్లై్ట్‌లో తాగిన పెప్సీ క్యాన్‌ను కూడా సేకరించి పెట్టుకున్నాడు. మొత్తంగా 15 వేల క్యాన్లను సేకరించి, ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు కావలెట్టి చెప్తున్నారు.