అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైయస్ఆర్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. గత మూడేళ్ల కంటే ఈ సారి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుండటం విశేషం. వాహనాల మరమ్మతులు, బీమా ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదే వైయస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు. 2022–23కు గాను అర్హత గల డ్రైవర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి రవాణా శాఖకు పంపించారు. ఈ ఏడాది మొత్తం 2,61,516 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.