శ్రీలంక ప్రధాన మంత్రి కూర్చునే కూర్చీకి ఆ దేశ మిలటరీ రక్షణ కల్పిస్తోంది. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. ఆ దేశంలోని నెలకొన్న పరిస్థితుల రీత్యా ఆ దేశ మిలటరీ ఇలా చేస్తోంది. ఇకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రోజుకో కొత్త దృశ్యం ఆసక్తి రేకెత్తిస్తోంది. సంక్షోభాన్ని నివారించలేని ప్రభుత్వాధినేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చేస్తున్న లంక ప్రజలు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని ఆక్రమించే యత్నం చేసిన దృశ్యాలు బుధవారం కలకలం రేపాయి. జనం ఆ భవనంలోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా ముందుగానే గొటబాయ దేశం వదిలి పరారైన సంగతి తెలిసిందే. ఇక ప్రధానిగా కొనసాగుతున్న రణిల్ విక్రమ సింఘే కూడా తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనలు మిన్నంటాయి.
ఈ క్రమంలో అధ్యక్షుడి భవనం మాదిరే ప్రధాని మంత్రిత్వ కార్యాలయాన్ని కూడా జనం ఎక్కడ ముట్టడించి అందులోకి చొరబడతారోనన్న ఆందోళనతో ఆ దేశ సైన్యం అప్రమత్తమైంది. పీఎంఓ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్న లంక సైన్యం... ప్రధాని కార్యాలయంలో ప్రధాని కూర్చునే కుర్చీ చుట్టూ సైనికులను మోహరించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.