బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంపై సవతి ప్రేమ చూపిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర వైసీపీ ఎంపీలతో కలిసి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై చేసిన చట్టం, నాటి కాంగ్రెస్ ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంపై సవతి ప్రేమ చూపిస్తోందని విజయసాయి విమర్శించారు. ఇక, విశాఖ రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, జీఎస్టీ నష్టపరిహారం కాలపరిమితి మరో ఐదేళ్లకు పెంచడం వంటి అంశాలను కూడా నేటి సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని విజయసాయి వివరించారు.