ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల భ్రమలు చాలా త్వరగానే తొలగిపోయాయి: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 17, 2022, 11:06 PM

వైసీపీపై ప్రజల భ్రమలు చాలా త్వరగానే తొలగిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ చెప్పిన నవరత్నాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని కూడా జగన్ చెప్పారని పేర్కొన్నారు. ఇవాళ నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని వివరించారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగన్ రాష్ట్రానికి మంచి చేస్తారని ప్రజలు ఆశించారని, కానీ జగన్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. అసలు, జగన్ ను ప్రజలు ఎలా నమ్మారో అర్థంకావడంలేదని పవన్ వ్యాఖ్యానించారు. 


జగన్ అధికారంలోకి రాగానే నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇళ్ల పట్టాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారని వివరించారు. వైసీపీ పాలనలో రక్షణ లేదని మహిళలు వాపోతున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందట్లేదని పవన్ కల్యాణ్ అన్నారు. 


"అండగా నిలబడతామని చెప్పి ఎస్సీలను ఎంతగానో నమ్మించారు. కానీ ఈరోజున ఎస్సీ సామాజికవర్గం వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి నెలకొంది. అట్రాసిటీ కేసులు సాధ్యం కాకపోతే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. ఈ వైసీపీ పాలన ఎమర్జెన్సీని మించిపోయింది. ఎమర్జెన్సీకి అమ్మ మొగుడైపోయింది. మొన్న గోపాలపురంలోనూ ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ జనవాణి ద్వారా ఈ విషయాలన్నీ నా దృష్టికి వచ్చాయి. 


సినిమా టికెట్ల విషయంలో సీఎస్ నుంచి కలెక్టర్లు, ఆర్డీవోల వరకు అందరినీ రంగంలోకి దించుతారు. కానీ ఇవాళ ఇళ్ల పట్టాల అంశంలో కానీ, టిడ్కో హౌసింగ్ విషయంలో కానీ, మౌలిక వసతుల అంశంలో కానీ అధికార యంత్రాంగాన్ని ఎందుకు తీసుకురారు? ఈ వ్యవస్థలు ఎందుకు పనిచేయవు? అని ప్రశ్నించారు.


"ఎందుకంటే వాళ్లకి వీటిపై ఆసక్తిలేదు. ప్రత్యర్థులపై దాడి చేయడానికి మాత్రం చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్ల వరకు అందరూ ముందుకొచ్చేస్తారు. 5, 10, 15 రూపాయల సినిమాల కోసం మీరు వ్యవస్థలన్నీ నడపగలరు కానీ, ఒక సగటు మనిషి కష్టం కోసం మీరెందుకు బయటికి రారు? లక్షల మంది దివ్యాంగులు ఉంటే వారిలో సర్టిఫికెట్లు ఉన్నవారికి కూడా పెన్షన్లు రాని పరిస్థితి ఉంది. ఏదో కొంతమందికి తూతూ మంత్రంగా ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే బండబూతులు తిడుతున్నారు. మీదపడి కరిచేస్తున్నారు. 


వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా... మేమూ మాట్లాడగలం. నేను కూడా ఇక్కడివాడ్నే. నేనేమీ హార్వర్డ్ లోనో, ఆక్స్ ఫర్డ్ లోనో చదవలేదు. ఇక్కడ పుట్టి తెలంగాణలో పెరిగినవాడ్ని, ఇక్కడి భాషలు నాకూ వచ్చు. పాలసీ గురించి మాట్లాడితే బూతులు తిడతారా? అడిగేవాడు లేరు అనుకుంటున్నారా?" అంటూ తీవ్రంగా స్పందించారు.


"ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు. వీళ్లకున్న చిత్తశుద్ధి సినిమా టికెట్ల అమ్మకంపై కలెక్టర్లను, చీఫ్ సెక్రటరీని, ఆర్డీవోలను పెడదాం అనేదానిపైనే ఉంటుంది. అంతేతప్ప పనిచేయించడంపై వీళ్లకు చిత్తశుద్ధి లేదు. భీమవరంలో డంపింగ్ యార్డ్ గురించి ఎందుకు పట్టించుకోరు?" అని ప్రశ్నించారు. 


బ్రాహ్మణ వర్గంలోని పురోహితుల సమస్యలు కూడా నా దృష్టికి తీసుకువచ్చారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలపైనా విజ్ఞప్తులు అందాయి. నవరత్నాల పథకాలపై ప్రజలు మనస్ఫూర్తిగా నమ్మి వైసీపీని 150కి పైగా సీట్లలో గెలిపించారు. అన్న అధికారంలోకి వస్తే తమకేదో అద్భుతాలు చేస్తారని ఆశించారు. ఏ ఆడబిడ్డ కంటతడి పెట్టకూడదని, సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకువస్తామని ప్రకటించారు. అన్న వచ్చాడు కానీ ఏం జరగలేదు. ఈ ముద్దుల మామయ్య వచ్చి మద్యం అమ్మడం మొదలుపెట్టాడు. మీకు బీరు కావాలా, ఇంకేం కావాలి? వైసీపీ స్పెషల్ తాగుతారా లేక వైసీపీ ఎక్స్ ట్రా స్పెషల్ తాగుతారా? అని అడుగుతున్నారు. చేయాల్సినవి చేయకుండా ఇలాంటివి బాగానే చేస్తారు" అంటూ విమర్శలు చేశారు. 


నిరుద్యోగం విషయంలో ఏపీ మూడోస్థానంలో ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. జగనన్న వచ్చాక ఏపీ సాధించిన ఘనతల్లో ఇదొకటని ఎద్దేవా చేశారు. నిరుద్యోగంలో రాజస్థాన్, బీహార్ తర్వాత స్థానం ఏపీదేనని వ్యంగ్యం ప్రదర్శించారు. అన్న సాధించింది ఇదీ! అంటూ వ్యాఖ్యానించారు. 


"రోడ్లపై నడుస్తుంటే గోతుల్లో పడతున్నామయ్యా బాబూ... ఈత కొట్టాల్సివస్తోందయ్యా మేము! డబ్బులన్నీ ఏంచేస్తున్నావు? ఖజానాలోంచి ఎందుకు బయటికి తీయడంలేదు. బూతులు తిట్టడం తప్ప మౌలికవసతుల గురించి మీరు పట్టించుకోరా? మేమేమీ అద్భుతాలు చేయమని అడగడంలేదు. ప్రజలకు అవసరమైనవి చేయమంటున్నాం. కానీ మిమ్మల్ని ఎవరూ అడగకూడదు, మాట్లాడకూడదు అంటే ఎలా? ఇప్పుడు రోజులు మారాయి. 


నేను ప్రజల కోసం దెబ్బలు తినడానికి, జైలుకు వెళ్లడానికి, అవమానాలకు సిద్ధంగా ఉన్నాను. మేం అద్భుతాలు సాధిస్తామని చెప్పలేం కానీ, ఎంతోకొంత అవినీతిని నిరోధించగలం, ఎంతోకొంత దోపిడీని అడ్డుకోగలం. ఇవాళ జనసేన నేతలు లేని గ్రామాలు ఉండొచ్చేమో కానీ, జనసైనికులు లేని గ్రామాలు లేవు. మా క్యాడర్ చాలా బలంగా ఉంది" అంటూ పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com