గోదావరికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైయస్ఆర్‌సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మిథున్‌రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపామన్నారు. ఆయా ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా లేనంతగా ప్రస్తుతం వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైందని, వందలాది గ్రామాలు నీట మునిగాయని, విపరీతమైన ఆస్తి, పంట నష్టం జరిగిందని సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందని తెలిపామని వివరించారు.