ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి అని వైసీపీ ఎంపీ లు కేంద్రాన్ని డిమాండ్ చేసారు. క్రొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వీరు మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ ఇంకా అమలు చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల విడుదలలో అసాధారణ జాప్యం జరుగుతోంది. అందువల్ల ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొంత నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం నివారించాలి. రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నష్ట పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలి. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కొన్నేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎందుకు కాలయాపన జరుగుతోంది? త్వరగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలో, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలి. ఈ విషయాల గురించి గతంలో సంబంధిత విమానయాన, స్టీల్ మంత్రిత్వ శాఖల మంత్రులకు కూడా విజ్ఞప్తి చేశాం. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.72కు పడిపోవడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అని తెలియజేసారు.