తలకు మించిన అప్పులు శ్రీలంకను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశాయని, మిగతా దేశాలకు ఇది కనువిప్పు కావాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా పేర్కొన్నారు. మితిమీరిన రుణభారం ఎదుర్కొంటున్న దేశాలు శ్రీలంక తరహా పరిస్థితులే చవిచూస్తాయని హెచ్చరించారు. "బాలి ద్వీపంపై నిర్మలంగా కనిపించే ఆకాశంలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతుందని భావించాం. కానీ వాస్తవానికి అలా జరగలేదు. సమస్యల అంధకారం నెలకొంది. అనిశ్చితి కట్టలు తెంచుకుంది. పరిమితికి మించి అప్పులు చేస్తే క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయని గతంలో మేం హెచ్చరించామో, ఇవాళ అవన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అధిక రుణభారం ఎదుర్కొంటున్న దేశాలు, విధానపరమైన సిద్ధాంతాల అమలుకు తగిన వెసులుబాటు లేని దేశాలకు అదనపు చిక్కులు తప్పవు. ఆయా దేశాల పరిస్థితి శ్రీలంక కంటే భిన్నంగా ఏమీ ఉండదు" అని క్రిస్టలీనా జార్జియేవా స్పష్టం చేశారు. ఆమె ఇండోనేషియాలో జరిగిన జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.