కోవిడ్ కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రాయితీని ఇచ్చిన రైల్వే శాఖ.. ఆ తర్వాత మాత్రం రాయితీ ఇవ్వడం లేదు. వయో వృద్ధులకు రాయితీ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. రైల్వే శాఖ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇచ్చిన రైల్వే శాఖ.. సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వడం కుదరదని పరోక్షంగా తెలిపింది. 2020 మార్చిలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని రైల్వే శాఖ ఎత్తేసింది. కానీ ఎంపీలు, మాజీ ఎంపీలకు ఇచ్చే సబ్సిడీని మాత్రం కొనసాగించింది.
ఇప్పటికే ప్రయాణికుల టికెట్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయని.. దాని వల్ల తాము నష్టపోతున్నామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ‘‘సీనియర్ సిటిజన్లు సహా ప్రయాణికుల టికెట్ల విషయంలో ఇప్పటికే 50 శాతానికిపైగా నష్టాన్ని భరిస్తున్నాం. టికెట్ల ధర తక్కువగా ఉండటమే దీనికి కారణం’ అని ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది.
‘‘2019-20తో పోలిస్తే.. కరోనా ప్రభావంతో గత రెండేళ్లలో ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. రాయితీలు రైల్వేకు భారంగా మారాయి. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలతోపాటు పలు రాయితీలు కోరదగినవి కావు. దీర్ఘకాలికంగా రైల్వేపై ఇవి ప్రతికూల ప్రభావం చూపుతాయి. చాలా అవరోధాలు ఉన్నప్పటికీ.. వికలాంగులు సహా నాలుగు కేటగిరీల వ్యక్తులకు, పేషెంట్లు, విద్యార్థుల్లాంటి 11 కేటగిరీలకు రాయితీ ఇస్తున్నాం’’ అని ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది.
రైల్వే శాఖ.. గరీబ్ రథ్, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, గతిమాన్, తేజస్, హమ్‌సఫర్, మెయిల్/ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ ప్యాసింజర్ లాంటి వివిధ రైలు సేవలను నిర్వహిస్తోంది. వీటిల్లోనూ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ రిజర్వ్డ్/ అన్ రిజర్వ్‌డ్ తదితర కేటగిరీలకు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వయో వృద్ధులు వీటిల్లో తమ ప్రాధాన్యాన్ని బట్టి ప్రయాణించొచ్చని రైల్వే శాఖ సూచిస్తోంది. 2019-20లో 22.62 లక్షల మంది సీనియర్ సిటిజన్ ప్రయాణికులు టికెట్ ధరలో ఇచ్చే రాయితీని వదులుకున్నారు.