ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరంలో పది, పన్నెండో తరగతి విద్యార్ధులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైయస్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అడ్డతీగల, రంపచోడవరంలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో సహా మొత్తం 28 ఏకలవ్య పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు.
2019-20 విద్యాసంవత్సరంలో ఏకలవ్య స్కూళ్ల నుంచి ఉత్తీర్ణులైన వారిలో 64 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్, 7 శాతం ఇంజనీరింగ్, 1.6 శాతం మెడికల్, 9 శాతం మెడికల్ సంబంధిత సర్వీసులు, 6 శాతం ఇతర వృత్తి విద్యా కోర్సులలో చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. ఏకలవ్య విద్యార్ధులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్‌ఈఎస్‌టీఎస్) మేనేజీరియల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అభివృద్ది చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.