ఇంట్లో ఎవరూ లేకపోతే మనం పెంచుకొనే పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటీ అన్నది అందరికీ వెంటాడే ప్రశ్న. కానీ ఇపుడు ఆ బెంగలేదూ అంటున్నారు. పెంపుడు జంతువులు ఏం చేస్తున్నాయో రోజంతా ట్రాక్ చేసేందుకు వీలుగా స్మార్ట్ వాచ్ ను బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు రూపొందించారు. ఈ వాచ్ ను పెట్స్ మెడలో బెల్ట్ కు పెడితే చాలని, వాటి నిర్వహణ ఎంతో సులువు అవుతుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు.
పల్లవి, ప్రార్థన, విస్మయ తాము రూపొందించిన ఈ వాచ్ కు ‘ఫాండ్’ అని పేరు పెట్టారు. త్వరలోనే ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వెబ్ సైట్ ద్వారా కొనుగోలుకు అవకాశం కల్పించాలన్నది వీరి ప్రణాళిక. ఈ ఫాండ్ వాచ్ తో పెట్స్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉండొచ్చని, దీనివల్ల వాటి జీవితకాలం పెరుగుతుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ ముగ్గురు చెబుతున్నారు.
అంతేకాదు, వీరు పెట్స్ కోసం మరో ఉత్పత్తిని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు. ఆటోమేటిక్ డ్రై ఫుడ్ డిస్పెన్సర్ ను అభివృద్ధి చేస్తున్నారు. దీని సాయంతో యజమానులు ఇంట్లో లేకపోయినా, ఉన్న చోట నుంచే ఇంట్లోని పెట్స్ కు ఆహారాన్ని అందించడం సాధ్యపడుతుందని చెప్పారు.