ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశంసలు పొందే పని చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనలతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు 24 గంటలు తిరిగే లోపే మానసిక వికలాంగురాలికి సాయం చేశారు. చంద్రబాబు నాయుడు పాలకొల్లు పర్యటన సందర్భంగా తన కుమార్తె మానసిక, శారీరక దివ్యాంగురాలని.. ఆమెకు పెన్షన్ అందడం లేదని స్వాతి తల్లి చంద్రబాబు నాయుడికి తెలిపారు. రెండేళ్లుగా స్వాతి అనారోగ్యంతో బాధపడుతోందని.. తమకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని ఆమె చంద్రబాబుకు తెలిపారు. స్వాతి కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు.. అప్పటికప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమెకు పెన్షన్ వచ్చేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుణ్ని ఆదేశించారు.
పార్టీ అధినేత ఆదేశాలతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. మరుసటి రోజే ఆ బాలికను తన కారులో బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఉన్న ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆధార్ కార్డ్‌కు ఫోన్ లింక్ చేసిన తర్వాత.. పెన్షన్ కోసం బాలికను సచివాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన తెలుగు దేశం పార్టీ.. రామానాయుడు స్పందించిన తీరును ప్రశంసించింది. అందుకే టీడీపీ అంటే ప్రజలకు ఒక భరోసా అని పేర్కొంది. జగన్ సర్కారు ప్రచారానికి, తెలుగు దేశం పార్టీ ప్రజా సేవకు తేడా ఇదేనంటూ.. స్వాతి వీడియోను పోస్టు చేసింది.