నేతలు చెప్పిన మాటను ఆచరించినపుడే ప్రజల్లో సైతం మార్పు వస్తుంది. అందుకే అదే బాటలో విశాఖ మేయర్ పయనిస్తున్నారు. ఇటీవల ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో.. సొంత వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నగరాల్లో వాహనాలు పెరిగిపోతున్నాయి. వాహనాలు పెరగడంతో కాలుష్యం పెరగడంతోపాటు.. ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలు నగర వాసులను ప్రజా రవాణా వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఈ విషయంలో అందరికీ ఆదర్శనంగా నిలుస్తున్నారు. మాటలు చెప్పడమే కాకుండా.. చేతల్లో ఆచరించి చూపిస్తున్నారు.
జీవీఎంసీ అమలు చేస్తోన్న ఫ్రీ వెహికల్ జోన్ పాలసీలో భాగంగా మేయర్ హరి వెంకట కుమారి క్యాంపు ఆఫీసు నుంచి జీవీఎంసీ ఆఫీసు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ విషయాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. జూలై నెల ఆరంభం నుంచి ప్రతి సోమవారం విశాఖ మేయర్ తన సొంత వాహనంలో కాకుండా.. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని ఆఫీసుకు వెళ్తున్నారు. అదే సమయంలో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ప్రతి సోమవారం సైకిల్ మీద ఆఫీసుకు వెళ్తున్నారు.