పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలతో ప్రభుత్వం ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం అని సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలను చూపిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది టీడీపీ పార్టీ. ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ నాయకులూ మాట్లాడుతూ... దేవీపట్నం మండలంలోని "తాళ్లూరి గ్రామం"లో సుమారు 100 నుండి 120 వరకు షెడ్యూల్ తెగలకు చెందిన కొండరెడ్డి కుటుంబాల వారు నివసిస్తున్నారు. వీరంతా పునరావాసం కింద తమ యొక్క జీవన విధానానికి అనువైన రావి లంక గ్రామం దగ్గర ఇళ్ళు కట్టించమని కోరారు. అందుకు అధికారులు కూడా అంగీకరించి సంతకాలు చేసారు, కానీ ఆ తర్వాత సీన్ మారింది. ఎవరికీ తెలియ కుండా గ్రామస్థుల ఇష్టానికి వ్యతిరేకంగా ఫజుల్లాబాద్ దగ్గర భీంపల్లి - 3 కొండ మొదలు సైట్ దగ్గర ఆ 120 కుటుంబాలకు పునరావాసం కల్పించింది ప్రభుత్వం. ఇది తెలిసి మా జీవనానికి అనువుగాని చోటికి వెళ్ళేది లేదంటూ వారంతా ముంపు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ఆ గ్రామానికి దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లి ఇదిగో ఇలా తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని అక్కడే ఉండి..వరద తగ్గుముఖం పట్టాక మళ్ళీ గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశమై గ్రామస్తులంతా కోర్టుకు వెళ్లారు. పునరావాస పథకంలోనూ రాజకీయాలేంటో! అని ప్రశ్నించారు.