తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలకు తులసి చెక్ పెడుతుంది. మరి తులసి వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.
నోటి దుర్వాసన సమస్య ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో పళ్లు తోముకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. నోట్లో పొక్కులు కూడా పోతాయి. గొంతు నొప్పి సమస్య ఉన్నవాళ్లు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా మారగనే తాగాలి. దాంతో గొంతునొప్పి మాయం అవుతుంది.
తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటంవల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. సాధారణ జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. నోటిపూతకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకులకు శరీరంలో కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారు తులసి ఆకులను చక్కెరతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.