కేంద్రం, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నారని కర్ణాటకలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ఇదిలావుంటే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని దుండగులు.. అతణ్ని హత్య చేశారు. 32 ఏళ్ల ప్రవీణ్ బల్లారి గ్రామంలో పౌల్ట్రీ షాప్ నడిపేవారు. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో షాప్ మూసేస్తుండగా.. ఆయనపై దాడి జరిగింది. కేరళ రిజిస్ట్రేషన్ ఉన్న బండి మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రవీణ్‌ను హత్య చేశారని తెలుస్తుండగా బీజేపీ యువ మోర్చా సభ్యుడైన ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
ప్రవీణ్ హత్యకు నిరసనగా కర్ణాటకలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రవీణ్ స్వగ్రామం వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నలిన్ కుమార్ కతీల్ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నారని ఆయనపై మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో చేరిన జనం కతీల్ వాహనాన్ని కదలనీయకపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.
యువ మోర్చా కార్యకర్త హత్య నేపథ్యంలో బీజేపీలో రాజీనామాలు పెద్ద సంఖ్యలో వెల్లువెత్తాయి. బీజేపీ సోషల్ మీడియా టీమ్ మెంబర్ శ్రీనివాస గౌడ బెంగళూరులో రాజీనామా సమర్పించారు. బీజేపీ ప్రభుత్వంలో రక్షణ లేదని భావిస్తున్నామని.. పార్టీ కార్యకర్తలను రక్షించుకోలేకపోతున్నామని.. అలాంటప్పుడు పార్టీ కోసం పని చేయడం ఉపయోగం లేదని శ్రీనివాస చెప్పారు.
ప్రవీణ్ హత్య తర్వాత పుత్తూరు, సూల్య, కదబ, బెల్తంగడీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. హత్యకు పాల్పడిన వారు కేరళలో ఉండే అవకాశం ఉందని భావిస్తోన్న పోలీసులు.. వారిని పట్టుకోవడం కోసం ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని తెలిపారు. ఇదే ప్రాంతంలో ఇటీవల 19 ఏళ్ల ముస్లిం యువకుడి హత్య జరిగింది. దీనికి ప్రతీకారంగానే ప్రవీణ్ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.