ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ మనుగడకు కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బీఎస్‌ఎన్ఎల్ మనుగడ సాగించడం కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. టెలీకాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత పెంచడం, అప్పులు తీర్చడం, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ ను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం చేయడం ద్వారా కంపెనీ ఫైబర్ (ఇంటర్నెట్) సేవలను విస్తరించడం కోసం ఈ ప్యాకేజీని ఉపయోగించనున్నారు.
ఈ ప్యాకేజీలో రూ.43,964 కోట్లు నగదు రూపంలో ఉండనుండగా... రూ.1.20 లక్షల కోట్ల మేర సాయం ఇతర రూపంలో ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బీఎస్ఎన్‌ఎల్ పునర్జీవన కార్యక్రమం నాలుగేళ్లపాటు ఉండనుంది. కానీ అందులో ఎక్కువ భాగం తొలి రెండేళ్లలో అమలు కానుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్రం అందించనున్న సాయంతో బీఎస్‌ఎన్ఎల్ తన సేవలను మెరుగుపర్చుకోవడంతోపాటు.. 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సంస్థ కోసం రూ.44,993 కోట్ల విలువైన 900/1800 ఎంహెచ్ జెడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. ఈ స్పెక్ట్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల్లోని విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా హై స్పీడ్ డేటాను అందించగలుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ఆత్మనిర్భర్ 4జీ టెక్నాలజీ స్టాక్‌ను విస్తరించే పనిలో ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్‌కు ప్రస్తుతం రూ.33 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నాయి. బాండ్ల జారీకి బీఎస్‌ఎన్ఎల్2కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. సంస్థ ఈ అప్పులను తీర్చేయనుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సబ్సిడరీ అయిన ఎంటీఎన్ఎల్‌క కూడా గ్యారెంటీ బాండ్లను ఇవ్వడం అనేది ప్యాకేజీలో ఉందని మంత్రి తెలిపారు. బీఎస్ఎన్ఎల్, బీబీఎన్ఎల్‌లకు కలిపి దాదాపు 14 లక్షల కిలోమీటర్ల పొడవైన ఫైబర్ నెట్‌వర్క్ ఉంది. ఈ రెండు సంస్థల విలీనం పూర్తయ్యాక.. మారుమూల ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా నెట్ సేవలను విస్తరించే అవకాశం బీఎస్ఎన్ఎల్‌కు లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 4జీతోపాటు 5జీ సేవలకు వీలుగా బీఎస్ఎన్ఎల్‌కు స్పెక్ట్రమ్ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించడానికి రెండేళ్ల సమయం పడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మే చివరి నాటికి దేశంలోని వైర్‌లెస్ టెలీకాం మార్కెట్లో ప్రయివేట్ టెలీకాం సర్వీస్ ప్రొవైడర్ల వాటా 89.97 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లకు 10.13 శాతం వాటా ఉందని జూలై 19న ట్రాయ్ వెల్లడించింది.