రాష్ట్రంలో 6 జిల్లాలలో వరద ప్రభావం చూపింది. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ వరదలు రాలేదు. రెండు రోజులు సీఎం గారు పర్యటించారు. బాధితులకు అందిన సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో అందరూ పని చేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని సీఎంగారు అన్నారు. ఆరు జిల్లాలో దాదాపు 3.46 లక్షల మంది వరద ప్రభావానికి లోనయ్యారు. వారిని పునరావాస శిబిరాలకు తరలించాం.
సుమారు 219 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో దాదాపు 1.80 లక్షల మందికి బస కల్పించి, ఆహారం, నీళ్లు అందించాం. దాదాపు 45 లక్షల నీళ్ల ప్యాకెట్లు సరఫరా చేశాం.
గోదావరి వరదల్లో ఏడుగురు చనిపోయారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చాం. వారే కాకుండా పునరావాస కేంద్రాల్లో ఉండి ఇంటికి వెళ్తున్న వారికి రూ.2 వేలు, 25 కేజీల బియ్యం, లీటర్ నూనె, కేజీ పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా ఇచ్చాం. అవే కాకుండా ప్యాకేజీ ప్రకారం వారికి అన్నీ అందజేస్తాం అని తెలియజేసారు.