తనపై ఎవరు కుట్ర చేశారనేది సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానాలు తెలుస్తాయంటూ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ పేర్కొన్నారు. అర్పితా ముఖర్జీ బయటపడిన కోటాను కోట్ల రూపాయల డబ్బు తనది కాదంటూ పార్థ ఛటర్జీ పేర్కొన్నారు. కోల్‌కతాలోని జోకాలో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చిన ఆయన్ను మీడియా ప్రశ్నించగా స్పందించారు. తన ఆరోగ్యం ప్రస్తుతం సరిగా లేదని.. తనపై ఎవరు కుట్ర చేశారనేది సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానాలు తెలుస్తాయంటూ చెప్పారు.
బెంగాల్ పాఠశాల ఉద్యోగుల నియామక కుంభకోణంలో గత వారం అరెస్టయిన తృణముల్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పార్థ ఛటర్జీ ప్రస్తుతం ఈడీ అదుపులోనే ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అవడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈడీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని అందరూ గమనించాలని కోరారు. తన మంత్రి పదవిని తొలగిస్తూ మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ మీడియా ముఖంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి పార్థ ఛటర్జీతో పాటు సినీనటి అర్పితా ముఖర్జీ, సుకాంతా ఆచార్యలను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. అర్పితా ముఖర్జీ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ కోట్ల రూపాయల డబ్బుతో పాటు భారీగా బంగారం, కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసింది. ఆ డబ్బంతా పార్థ ఛటర్జీదేనని ఆమె విచారణలో వెల్లడించగా.. పార్థ మాత్రం ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు.