తెలుగు సంవత్సరాది ప్రకారం ఎక్కువ పెళ్లిళ్లు మాఘమాసంలో జరుగుతుంటాయి. కానీ ఆషాఢ మాసం లో ఎవరూ పెళ్లిళ్తు చేసుకోరు. ఇదిలావుంటే తాజాగా ఆషాఢ మాసం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలు కానుంది. శ్రావణ మాసం రాకతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చేశాయి. ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో వేల జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఆగస్టు మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఆయా కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జులై 31, ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ కాలం దాటితే మళలీ 4 నెలల వరకు ఎదురుచూడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో ఆగస్టులోనే పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు ఆరో తేదీ రాత్రి మంచి ముహూర్తం ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సంవత్సరాది ప్రకారం ఎక్కువ పెళ్లిళ్లు మాఘమాసంలో జరుగుతుంటాయి. ఆ తర్వాత స్థానం శ్రావణం, కార్తీక మాసాలది. శ్రావణంలో ముహూర్తాలు కుదరని వారు కార్తీకంలో మూహూర్తాలు పెట్టుకునేవారు. అయితే జులై, ఆగస్టు నెలల్లో వానల భయంతో చాలామంది అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే కార్తిక మాసంలోని ముహూర్తాలకే ప్రాధాన్యమిచ్చేవారు. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కార్తీక మాసంలో శుక్ర మూఢాలు రావడంతో మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో శ్రావణం దాటితే మళ్లీ డిసెంబర్‌లో వచ్చే మార్గశిరం వరకు ఆగాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అంతవరకు ఆగలేని కుటుంబాలు శ్రావణంలోనే తమ బిడ్డలకు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రోహిణి నక్షత్రం ఎక్కువ మంది వధూవరులకు కలిసొస్తుందని.. అందువల్లే 20, 21 తేదీల్లో అధికంగా పెళ్లిళ్లు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
కోవిడ్ కారణంగా 2022, 2021 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. బంధుమిత్రలు సమక్షంలో వైభవంగా వివాహం చేయాలన్న ఉద్దేశంతో చాలా కుటుంబాలు తమ బిడ్డల పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఈ నెల ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు బుక్ అయిపోయినట్లు తెలుస్తోంది.