ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో అటు ప్రభుత్వం ఇటు ఆర్బీఐ ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం 6 శాతం పైబడే ఉంటుందని ఆర్బీఐ ప్రకటించడం గమనార్హమని అన్నారు. పరాయి దేశాల్లో ద్రవ్యోల్బణం రేటుతో పోల్చుకొని మనం మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని అన్నారు. ద్రవ్యోల్బణం అనేది చట్టబద్దత లేని పన్నులు వడ్డింపు వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరకమైన వడ్డింపులు రాజ్యంగంలోని ఆర్టికల్ 38ని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.
వివిధ వర్గాల ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు రూపుమాపి, సామాజిక అంతరాలు తొలగించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కానీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విజయసాయి రెడ్డి అన్నారు. కొందరు సభ్యులు పేర్కొన్నట్లు హోల్ సేల్ ధర సూచికతో పోలుస్తూ ద్రవ్యోల్బణం 15. 1% ఉందని చెప్పడం సరికాదు, కొనుగోలు ధర సూచికతో పోల్చడమే సరైన పద్దతి. ఆవిధంగా చూస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7. 1 % మాత్రమే ఉంది. యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం 10. 4% ఉందని ఆయన గుర్తు చేశారు.
*ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల సమాన్యుడిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. 2000 సంవత్సరంలో 1 లక్ష రూపాయలు ప్రస్తుతం 27 వేలకు సమానమని అన్నారు. దేశంలో ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఆ మేరకు తగిన చర్యలు చేపట్టి ధరల పెరుగుదలను అదుపు చేయాలని ఆయన సూచించారు.
పన్నుల ద్వారా వచ్చే ఆదాయం (సెంట్రల్ గ్రాస్ టాక్స్ రెవెన్యూ)లో ఆంధ్రప్రదేశ్‌కు నిర్ణయించిన వాటా మేరకు కేంద్రం చెల్లించనందున గడిచిన ఏడేళ్ళలో రాష్ట్రం 46 వేల కోట్లు నష్టపోయిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పన్నుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వలన దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి 11 లక్షల 26 వేల కోట్లు నష్టపోయాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆదాయాన్నిలూటీ చేసిందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినట్లు సెంట్రల్ గ్రాస్ టాక్స్ రెవెన్యూలో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వడం లేదని, కేవలం 31 నుంచి 32 శాతం వాటా మాత్రమే చెల్లిస్తోందని అన్నారు. సెస్, సర్ చార్జీలను ఎడాపెడా విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను లూటీ చేస్తుందని అన్నారు.
*వలస కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కోవిడ్ మహమ్మారి కారణంగా వలస కూలీలు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారని, వారికి ఉపాధి కల్పించడం ఉద్యోగ భద్రత ఇవ్వడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చు. 2022 జనవరి- మార్చి మధ్యలో 47. 3% గా ఉన్న లేబర్ భాగస్వామ్యం ఒక్క మార్చి నెలలోనే 39. 5% కి పడిపోయింది. 3. 8 లక్షల మంది శ్రామికులు ఉపాధి కోల్పోయారు. ఆయిల్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత 7 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధరలను నమోదు చేశాయని అన్నారు. అదే సమయంలో దేశీయంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని అన్నారు.
*చిన్న పొదుపు స్కీములపై వడ్డీ రేట్లు పెంచాలి
కేంద్ర ప్రభుత్వ 10 సంవత్సరాల బాండ్లపై వడ్డీ రేట్లు 6. 4% నుంచి 7. 46%కి పెంచినట్లుగానే చిన్న పొదుపు స్కీములు, పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన, వయోవృద్ధులు పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెంచడం ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో నగదు లభ్యత పెరుగుతుందని సూచించారు.