భారతీయుల దేశభక్తి, జాతీయ భావం ప్రకటించు కోవడమే ఆజాదీ కా అమృత్ మహోత్సవమని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవల జయంతి సందర్భంగా వారి చిత్రాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశానికి జాతీయ జెండా రూపకల్పన చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు పింగళి వెంకయ్య, తెలుగు నాటక రంగ పితామహులు బళ్ళారి రాఘవ జన్మదినోత్సవాలను జరుపుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వారిని గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే "హర్ ఘర్ తిరంగా" (ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండా) కార్యక్రమం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అధికారులు ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంటిలో స్వాతంత్ర్య పండుగను జరుపుకునేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన దేశభక్తులు, కళాకారుల జీవితాల నుండి మనం ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పి. వెంకట రమణ మాట్లాడుతూ పింగలి వెంకయ్య, బళ్ళారి రాఘవల గురించి, వారు చేసిన గొప్ప పనులను గురించి సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి. ఎస్. ఒ. శివ ప్రసాద్, డ్వామా పిడి పూర్ణిమ, పంచాయతీరాజ్ ఈఈ, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.