అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం కేసులను (పోక్సో) త్వరతిగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశలో 12 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు పేర్కొన్నారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. క్రిమినల్ లా చట్టానికి అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద దేశంలో 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి మాత్రమే పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు 1,572 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 971 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. నిర్భయ నిధుల నుంచి కేంద్రం తన వాటాను కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులలో కలిపి లక్షకు పైగా కేసులను పరిష్కరించినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరును మదింపు చేసిన నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ నివేదిక ప్రకారం మొత్తం పోక్సో కేసులలో 17.64% కేసులలో శిక్షలు విధించినట్లు తెలిపారు. ప్రత్యేక కోర్టులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఆన్‌లైన్ మానిటరింగ్ పద్దతి ద్వారా నెలవారీ సమీక్షలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తమ మంత్రిత్వ శాఖ తరచుగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుస్తున్నట్లు మంత్రి తెలిపారు.