కొన్ని సందర్బాలలో అయినవారు కోల్పోతే కలిగే బాధ ఏమిటో మనం ఊహించనిది. అలాంటి బాధను, నాటి తన కూతరు జ్ఞాపకాలతో ఓ తల్లి 25 ఏళ్ల నుంచి ఏం చేసిందో తెలిస్తే మాత్రం షాక్ కు గురవుతాం. ఆమె పేరు డయానా ఆర్మ్ స్ట్రాంగ్.. అమెరికాలో ఉండే ఆమె ఓ రోజు రాత్రి తన కూతురితో ప్రేమగా మాట్లాడుతోంది. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న ఆ కూతురు.. తల్లిని కూర్చోబెట్టి ఆమె రెండు చేతి గోర్లకు నెయిల్ పాలిష్ వేసింది. కబుర్లు చెప్పుకొంటూ ఇద్దరూ నిద్రపోయారు. కానీ ఆ మరునాడే ఆ కూతురు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఆ తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ముందు రోజు రాత్రి తన కూతురు ప్రేమగా నెయిల్ పాలిష్ పెట్టిన విషయాన్ని తలచుకుని బాధపడింది. ఆమె జ్ఞాపకాలను పోనివ్వకూడదని నిర్ణయించుకుంది. కూతురు పెట్టిన నెయిల్ పాలిష్ పోతుందని గోర్లు కత్తిరించడం మానేసింది.
కుమార్తె మరణించి, గోర్లు కత్తిరించడం మానేసి 25 ఏళ్లు అయింది. ఆమె మిగతా పిల్లలు గోర్లు కత్తిరించుకోవాలని చాలాసార్లు తల్లిపై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆమె తన కూతురు జ్ఞాపకాలు అని, వాటిని తీయబోనని కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెపై ఒత్తిడి చేయడం మానేసి.. ఆ గోర్లతోనే ఆమె ఇబ్బందులు లేకుండా గడిపేందుకు కుటుంబ సభ్యులు తోడ్పడటం మొదలుపెట్టారు. డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ గోర్లు అన్నీ కలిపితే 42 అడుగుల 10 అంగుళాలకు పైనే ఉన్నాయి. దీనితో అతి పొడవైన చేతివేలి గోర్లు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో నమోదైంది. ఇక ఆమె చేతి గోర్లలో అతి పొడుగ్గా ఉన్నది కుడిచేతి బొటన వేలికి ఉన్న 4 అడుగుల 7 అంగుళాల గోరు.. అతి చిన్నది ఎడమ చేతి చిటికిన వేలికి ఉన్న 3 అడుగుల 7 అంగుళాల గోరు. ఇటీవలే గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆమెను కలిసినప్పుడు తన చేతి గోర్లను చూపిస్తూ.. తన గతాన్ని చెప్పుకుంది. గిన్నిస్ వాళ్లు ఇదంతా వీడియో తీసి తమ యూట్యూబ్ చానల్ లో పెట్టారు.