రాజకీయాలలో మహిళలు ఇంకా కీలుబొమ్మలుగానే కనిపించడం ఆందోళన కలిగించే పరిణామం. మధ్యప్రదేశ్ లోని దమోహ్ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడి గైసాబాద్ గ్రామ పంచాయతీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఓ మహిళ సర్పంచ్ గా నెగ్గగా, మరికొందరు మహిళలు కూడా వార్డు మెంబర్లుగా గెలిచారు. అయితే ప్రమాణ స్వీకారం రోజున ఆశ్చర్యకర దృశ్యాలు కనిపించాయి. గెలిచిన మహిళల్లో ఒక్కరూ పంచాయతీ పరిసరాల్లో కనిపించకపోగా, వారి తరఫున భర్తలు ప్రమాణస్వీకారం చేస్తూ దర్శనమిచ్చారు. దీనిపై జిల్లా కలెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక అందించాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గ్రామ పంచాయతీ సీఈవో అజయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ, గెలిచినవారికి బదులు మరొకరు ప్రమాణం చేయడం నిబంధనలకు విరుద్ధమని, శాఖాపరమైన విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.