ఏదైనా చేస్తే నలుగురు ఆలోచించాలి. దాని గురించి చర్చించుకోవాలి. ఇదే జరిగితే మీకు ఆలోచనకు జనం జై కొట్టడమే కాదు వ్యాపారం కూడా పుంజుకొంటుంది. అలాంటి ఘటనే ఇపుడు గుజరాత్ లో కనిపిస్తుంది. స్టీల్ కప్పులు, పింగాణీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, మట్టి కప్పులు, పేపర్ కప్పుల్లో ‘టీ’ని సరఫరా చేయడం చూశాం. కానీ, ఐస్ క్రీమ్ కోసం ఉపయోగించే కోన్ కప్పుల్లో టీ ఎప్పుడైనా తాగారా..? గుజరాత్ లోని వడోదరలో ఒక స్టాల్ ఇప్పుడు కొత్తగా ఇదే ప్రయత్నం చేసింది. కస్టమర్లకు ఐస్ క్రీమ్ కోన్ కప్పుల్లో (ఎడిబుల్) టీలను అందిస్తోంది. అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ తో తయారు చేసిన కప్పుల్లో సరఫరా చేస్తోంది. దీంతో టీ తాగిన తర్వాత ఖాళీ కప్పును టేస్టీగా తినేయవచ్చు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం కొంతైనా తగ్గుతుంది.
వడోదరలోని ‘క్లాన్ టీ హౌస్’ దీనికి చిరునామాగా ఉంది. ఎడిబుల్ కప్పులను గోధుమ పిండి, స్టార్చ్ తో తయారు చేస్తారు. చాక్లెట్ ఫ్లేవర్ కూడా అద్దారు కనుక టీతోపాటు, అది కూడా రుచికరంగా ఉంటుంది. అనాధ శరణాలయానికి చెందిన నలుగురి వినూత్న ఆవిష్కరణే ఇది. ఇటీవలే కేంద్రం ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించడం తెలిసిందే. దీంతో కొత్తగా ప్రయత్నించాలని వారికి అనిపించింది. చెట్లను కొట్టి వాటితో తయారు చేసే పేపర్ కప్పులతోనూ పర్యావరణానికి హానికరమేనని భావించారు. దీంతో కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నారు. ఇంటర్నెట్ లో ఎడిబుల్ కప్పుల గురించి తెలుసుకుని వాటికి ఆర్డర్ చేశారు. వీటిల్లో తాగిన వారు తమకు తెలిసిన వారిని కూడా తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీ, ముంబైలోనూ ఇలాంటి కప్పులను ఉపయోగించే స్టాల్స్ ఉన్నాయి.