ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరుకానున్న సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 03:40 AM

ఓ వివాహ కార్యక్రమం నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఆముదాలవలసలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. తన తనయుడు చిరంజీవినాగ్ వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్నారని తమ్మినేని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం నివాసం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వస్తారని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకి 2.20కు చేరుకుంటారన్నారు. 2.40కు హెలీకాప్టర్ లో విశాఖపట్నం నుంచి బయల్దేరి 3.20 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ తిమ్మాపురం హెలీపాడ్‌కు చేరుకుంటారని వివరించారు.


3.20 నుంచి 3.40 వరకు ప్రజలతో మమేకమవుతారని.. అనంతరం అక్కడ నుంచి రోడ్డుమార్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన వివాహ స్థలానికి 3.50కి చేరుకుంటారన్నారు. 4.10 వరకు వివాహ ప్రాంగణంలో సుమారు 20 నిముషాలు ఉండి వధూవరులను ఆశ్వీరదించి.. 4.15కి బయల్దేరి 4.25 కు తిమ్మాపురం హెలీప్యాడ్ కు చేరుకుంటారన్నారు. 4.30 కి హెలీకాప్టర్ విశాఖకు సాయంత్రం 5.10గంటలకు చేరుకుని.. అక్కడ నుండి 5.20 గంటలకు విమానంలో ఢిల్లీకి పయనమవుతారని తెలిపారు. ఢిల్లీలో అదే రోజు పలు అధికారిక కార్యక్రమాలకు హాజరు కానున్నారని తెలిపారు.


ఆముదాలవలసలో జరిగే తమ తనయుని వివాహం సందర్భంగా ప్రజాజీవనం స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. ఇది కేవలం కొందరు వ్యక్తులు కావాలనే గత వారం రోజులుగా సృష్టిస్తున్న వదంతులు మాత్రమే అన్నారు. వివాహం సందర్భంగా సీఎం రాకతో పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేసే వీలుందని.. పలు దుకాణాలు మూతపడక తప్పదని తప్పుడు ప్రచారంతో వదంతులు వ్యాప్తి చేశారన్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పీకర్ స్పష్టం చేశారు.


ప్రజా జీవనానికి ఇబ్బందులు కలుగజేసేలా వ్యవహరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. సీఎం జగన్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు వివాహానికి ఆముదాలవలస రానున్నారని తెలిపారు. సీఎం, మంత్రులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో కొనసాగే వారికి, రాష్ట్ర స్థాయి ఉన్నాతాధికారులకు నిర్దేశిత ప్రోటోకాల్ ఉంటుందన్నారు. ప్రోటోకాల్ మేరకు మాత్రమే జిల్లా అధికారులు బందోబస్తును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆముదాలవలస పట్టణ, సమీప ప్రజానీకం యొక్క దినసరి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.


ఆమదాలవలసలో ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవచ్చు.. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు భయం వద్దన్నారు. ఏ షాప్స్ క్లోజ్ చేయం.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్థానికులు పోలీసులకు సహకరించాలన్నారు. సీఎం ఉండేది గంట కాలం మాత్రమేనని.. అందరూ వచ్చి నా కుమారుడి పెళ్లికి వచ్చి వధూవరులని ఆశీర్వదించాలన్నారు. అందరూ హాయిగా ఉంటే తనకు ఆనందం అన్నారు. వదంతులు నమ్మొద్దని.. పెళ్లికి వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్ ప్లేసెస్ వద్ద నుండి పెళ్లి మంటపం వరకు వృద్ధులు కోసం ప్రత్యేక మిని బస్ లు ఏర్పాటు చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com