ఆడపిల్లలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. ప్రార్థన స్థలాలు, చదివే విద్యాలయాలు. నమ్మిన వారి నివాస స్థలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇదిలావుంటే పాఠాలు నేర్పించి... భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురువే.. విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అమ్మాయిని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు. ఓ విద్యార్థినితో బలవంతంగా మద్యం తాగించాడు. తాగిన తర్వాత ఆ అమ్మాయి ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్.. ఆ వృత్తికే కళంకం తెచ్చే పని చేశాడు. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి తన దగ్గర ట్యూషన్ కోసం వచ్చిన స్టూడెంట్ (15)తో అనుచితంగా ప్రవర్తించాడు. క్లాసులు పూర్తైన తర్వాత విద్యార్థినిపై శారీరకంగా దాడి చేసి.. ఆమెతో ఓడ్కా తాగించాడు. అయితే వెంటనే ఆ అమ్మాయి అస్వస్థతకు గురైంది. దాంతో భయపడి కారులో తన ఇంటి దగ్గర వదిలేశాడు. ఇంటికెళ్లిన అమ్మాయి పరిస్థితిని చూసి.. తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నారు. అనంతరం ట్యూషన్ టీచర్‌పై ఫతేగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గురువారం రాత్రి ఆ టీచర్‌ని అరెస్ట్ చేశారు.
"నిజాంపుర ప్రాంతంలో ప్రశాంత్ ఖోస్లా ట్యూషన్ నిర్వహిస్తున్నాడు. బుధవారం ట్యూషన్ తర్వాత ఖోస్లా పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తనతో కూర్చుని మద్యం తాగమని పట్టుబట్టాడు. బాలికను తన వెంట రమ్మని బలవంతం చేసి మద్యం తాగించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆమెను ఇంట్లో దించాడు. బాలిక తల్లిదండ్రులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు, అక్కడ ఆమె చికిత్స పొందుతోంది." అని ఫతేగంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కేపీ పర్మార్ చెప్పారు. ఈ మేరకు పోలీసులు ప్రశాంత్ ఖోస్లాపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు ఫైల్ చేశారు.
ఇదిలావుంటే గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. మీరా ఉద్యోగ్‌నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి.. తన పొరుగింటికి చెందిన దంపతుల రెండేళ్ల కుమారుడికి మద్యం తాగించాడు. అది గమనించిన తల్లిదండ్రులు బాలుడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. రాజ్‌కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.