పోలీసులంటే భయపడే పరిస్థితి పోయిందన్నట్లుగా ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఓ వింత ఘటన చోటుచేసుకొంది. ప్రజలకు ధైర్యంగా ఇవ్వాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోయిందా..? పోలీసుల భద్రతే ప్రశ్నార్థకం అయిపోయిందా..? సాధారణ ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేస్తే.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీస్తారు. తమకు న్యాయం చేయడంటూ.. పోలీసులకు మొరపెట్టుకుంటారు. కానీ పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. ఇక ప్రజల పరిస్థితి ఏమిటి..?.. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన ఈ అనుమానాలను రేకెత్తిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
పోలీస్ స్టేషన్‌లోఓ కానిస్టేబుల్‌పై దాడి చేయడం.. తనను విడిచిపెట్టమని ఆ కానిస్టేబుల్ చేతులెత్తి వేడుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన న్యూఢిల్లీ ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. స్టేషన్‌లోకి 10, 12 మంది వ్యక్తులు ప్రవేశించి.. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. అయితే అక్కడున్నవారు ఎవరూ దానిని ఆపేందుకు ప్రయత్నించలేదు. దాంతో ఆ కానిస్టేబుల్ చేతులెత్తి.. తనను విడిచిపెట్టమని కోరాడు. అయినా సరే ఎవరూ కనికరించలేదు. ఈ అవమానకరమైన సంఘటన ఆగస్ట్ 3వ తేదీన జరిగినట్టు తెలుస్తుంది. ఆ బాధితుడు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్‌గా తెలుస్తుంది.
అక్కడున్న వారిలో ఒకరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ హెడ్ కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారో.. ఎవరు అంతా దారుణంగా ప్రవర్తించారనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. పోలీసుపై దాడి చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు వీడియో ఉన్నతాధికారుల దాకా చేరడంతో విచారణకు ఆదేశించారు. వీడియో వైరల్ అవుతుండడంతో నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతోంది ఢిల్లీ పోలీస్ విభాగం. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.