మనదేశంలో ఎన్నో వింతలను మనం చూస్తూవుంటాం. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఓ వింత నెలకొంది. ప్యాసింజర్లతో పాటు.. ఓ ఎద్దు కూడా ట్రైన్‌లో ప్రయాణించింది. పైగా తన స్టేషన్ వచ్చే వరకు ఆ ఎద్దు ఒంటరిగానే ప్రయాణించింది. ఇది నిజమేనా అనుకుంటున్నారా..? అచ్చంగా నిజం. జార్ఖండ్‌లోని మీర్జాచౌకి నుంచి సాహిబ్‌గంజ్‌కు వెళ్లే ఓ ప్యాసింజర్ ట్రైన్‌లో ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
12 మంది వ్యక్తులు ఎద్దును మీర్జా చౌకి రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చి.. సాహిబ్‌గంజ్‌కు వెళ్లే ప్యాసింజర్ రైల్లోని ఒక బోగిలోకి దానిని ఎక్కించారు. కంపార్ట్‌మెంట్ ఎంట్రన్స్ వద్ద ఉన్న సీటు హ్యాండిల్‌కు దానిని కట్టేశారు. చివరి స్టేషన్ సాహిబ్‌గంజ్‌కు ఆ రైలు చేరుకున్న తర్వాత కట్టిన తాడు విప్పి దానిని కంపార్ట్‌మెంట్ నుంచి కిందకు దించాలని అందులోని ప్రయాణికులకు చెప్పి వాళ్లు వెళ్లి పోయారు. దీంతో రైల్లో ఆ ఎద్దు ఒంటరిగానే ప్రయాణించింది.
అయితే ఎద్దు ఉండడంతో ప్రయాణికులు ఆ బోగీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో ఆ బోగీలో కొద్దిమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. బోగీలో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి.. ఆ ఎద్దు ఎలా ఎక్కిందనే విషయాన్ని వివరించాడు. ఈ వీడియోను జర్నలిస్ట్ ప్రకాష్ కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి సరదా సంఘటన ఒక్కటి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోకల్ ట్రైన్‌లో ఓ వ్యక్తి తన గుర్రాన్ని ఎక్కించి తీసుకెళ్లాడు. పైగా ఆ రైలు రద్దీగా ఉంది. రద్దీగా డైమండ్ హార్బర్ లోకల్ ట్రైన్‌లో తన గుర్రాన్ని ఎక్కించుకుని హాయిగా తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇలా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ఇలా గుర్రాలు, ఎద్దులు ఎక్కిస్తుంటే రైల్వే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.