కొన్ని బోర్డులు...వాటిలో రాసిన కంటెంట్ అందర్నీ ఆకర్షిస్తుంది. అలాంటితో కూలులో ఓ బోర్డు దర్శనమిచ్చింది. దీంతో ఆ బోర్డు ఇపుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే... పోలీసులు జరిమానాలు విధిస్తారు. వార్నింగ్‌లు.. కౌన్సెలింగ్‌లు ఇస్తారు. మందు కొట్టి వాహనాలు నడపొద్దని వాహనదారులకు అవగాహన కల్పిస్తుంటారు. తాగి వాహనాలు నడపడం వల్లే జరిగే ప్రమాదాలు, పరిణామాలపై వివరంగా చెబుతారు. విద్యాలయాలు, అపార్టమెంట్లలో మీటింగ్‌లు పెట్టి మరీ అందరికీ తెలియజేయడం మామూలే. కానీ కులు పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా కొత్తగా ట్రై చేసింది. తాగి వాహనాలు నడపొద్దని ప్రజలకు తెలియజేసేందుకు వెరైటీగా ఓ బోర్డ్ పెట్టింది. ఆ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ బోర్డులో ఉన్నదాన్ని చూసి నెటిజన్లు నవ్వులు చిందిస్తున్నారు.
ఈ బోర్డుకు సంబంధించిన వీడియోని అజ్నాస్ కేవీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ బోర్డులో "మద్యం తాగి వాహనం నడప వద్దు. మనాలిలోని జైలు చాలా చల్లగా ఉంది." అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పైగా "సిగరెట్ ఊపిరితిత్తులను కాల్చేస్తుంది" అని బోర్డులో ధూమపానంపై కూడా ఓ సలహా రాసిపెట్టారు. అనూహ్యంగా ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోని ఐదు మిలియన్ల మంది చూశారు. లైకులు మీద లైకులు కొడుతున్నారు. దానిని చూసిన నెటిజన్లు అంతే వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కామెంట్ బాక్స్‌లన్నీ ఏమోజీలతో నింపేస్తున్నారు.
అలాగే ఈ వీడియోను చూసిన చాలామంది పోలీసుల చమత్కారాన్ని మెచ్చుకుంటున్నారు. షేర్ చేస్తున్నారు. కొంతమంది యూజర్లు బోర్డులో విషయం సరే.. మరీ బోర్డు చుట్టూ ఉన్న గంజాయి మొక్కల సంగతేంటంటూ..? ప్రశ్నించారు. అంతేకాదు ఆ బోర్డు పెట్టిన కచ్చితమైన లోకేషన్ తెలియజేయాలని కామెంట్ పెట్టారు. ఒక యూజర్ మనాలీకి బ్యాగ్‌లు సర్దుకోవాల్సిందే అని కామెంట్ పెట్టారు. మొత్తానికి పోలీసులు పబ్లిక్‌తో కనెక్ట్ అవ్వడానికి వినూత్నంగా ప్రయత్నించడమే కాకుండా వ్యంగ్యంలోనూ రాణిస్తున్నట్టు తెలుస్తుంది.