ఎక్కడపడితే అక్కడ..పరిసరాలను చూసుకోకండా వంట మంట పెడితే జరిగే ప్రమాదం గురించి తెలియజేసే ఘటన బీహార్ రాష్ట్రంలో నెలకొంది. పడవలో వంట చేస్తుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. బిహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా రాంపూర్‌లోని దియారా ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తీరానికి సమీపంలో నిలిపి ఉంచిన మర బోటులో వంట చేస్తుండగా.. ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తొలుత భావించారు. అయితే.. డీజిల్ నింపి ఉంచిన క్యాన్ సమీపంలో స్టవ్ వెలిగించి వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ డీజిల్‌కు మంటలు అంటుకొని బీభత్సం జరిగిందని పోలీసులు తెలిపారు. బోటులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూలీలు చిక్కుకుపోయి మరణించారు. మృతులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.