కుప్పంలో చంద్రబాబును...మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడమే ధ్యేయంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఆ రెండు నియోజకవర్గాలలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తోంది. నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వారసుడిగా తెలుగు రాజకీయాల్లో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల తర్వాత నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎమ్మెల్సీగా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ నియోజకవర్గంలోనే కొనసాగుతున్నారు. 2024లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. మంగళగిరికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నా.. ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ బలోపేతం అవుతుందని భావించిన ప్రతిసారీ చుక్కెదురవుతోంది.
టీడీపీని వరుసగా నేతలు వీడటం కలవరపెడుతోంది. 2019 జనవరిలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరారు.. కానీ ఎన్నికలకు ముందు మాత్రం పార్టీ జంప్ కొట్టేశారు. బీసీ కోటాలో తనకు సీటు వస్తుందని భావించానని.. కానీ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆమె పార్టీ మారిన ప్రభావం కొంతమేర లోకేష్‌కు నష్టం కలిగించిందనే చెప్పాలి. కాండ్రు కమల 2009లో మంగళగిరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
గతేడాది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో చుక్కెదురైంది. మాజీ మంత్రి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని.. పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. అలా పార్టీలో చేరకముందే ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. మురుగుడు హనుమంతరావు 1999, 2004లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
ఇప్పుడు తాజాగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తాను పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని.. పార్టీలో కొంతమంది తనను రాజకీయంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.. పార్టీ అధికార ప్రతినిధి పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేయగా.. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడంతో గంజి చిరంజీవికి సీటు దక్కలేదు.. అయినా అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. లోకేష్‌కు అనుచరుడిగా ఉన్నారు.. ఉన్నట్టుండి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా వరుసగా ముగ్గురు నేతలు టీడీపీని వీడారు.
మంగళగిరిలో నారా లోకేష్‌కు చెక్ పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ సరికొత్త వ్యూహాలను అమలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. ప్లాన్ 'బీ' తో ముందుకు వెళుతుందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి దూరమైన ముగ్గురు నేతలు బీసీలు.. ఇప్పటికే ఇద్దరు నేతలు (కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు)లు వైఎస్సార్‌సీపీలో చేరగా. గంజి చిరంజీవి కూడా అధికార పార్టీలోకి వెళతారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ ముగ్గురు నేతల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా మంగళగిరిలో ఉన్న బీసీలకు దగ్గరవ్వాలని భావిస్తోంది. ఆ దిశగా వీరిని పార్టీలోకి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ముగ్గురు బీసీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనే చర్చ మొదలైంది.